
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం గణపతి హోమం జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ వినాయకస్వామి ప్రతిమకు విశేష అలంకరణ చేపట్టారు.
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో అర్చక బృందం పూజ, జపం, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన నిర్వహించారు. వినాయకుడికి ప్రీతిపాత్రమైన కుడుములు, నెయ్యి, అన్నం, అటుకులు, బెల్లం, అరటిపండ్లు తదితర అష్టద్రవ్యాలతో హోమం చేపట్టారు. ఇందులో 16 నామాలతో గణపతిని స్తుతించారు. కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు జపం, హోమం, శ్రీ గణపతి సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం మరియు హారతి ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
