చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వినాయక చవితి నాటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు కమ్మ కులస్తులచే ఘనంగా చిన్న శేష వాహన కార్యక్రమం నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు చిన్న శేష వాహనంపై కాణిపాకం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశాడు. వంద కలశాలతో స్వామివారికి పాలాభిషేకం పూజలు నిర్వహించారు. పాల కలశాలతో పురవీధుల్లో ఊరేగి భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో పూతలపట్టు మురళీమోహన్, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు.
కాగా.. వినాయక చవితి వేళ కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి భక్తులకు గుడ్ న్యూస్ అందింది. కాణిపాకం దేవస్ధానానికి ఐఎస్‌వో 9001 : 2015 సర్టిఫికెట్ జారీ అయ్యింది. దీనిని ఐఎస్‌వో సంస్థ ప్రతినిధి శివయ్య.. దేవస్థానం అధికారులకు అందజేశారు. వినాయక చవితి పర్వదినం రోజు కాణిపాకం దేవస్ధానంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్, కాణిపాకం దేవస్ధానం ఈవో గురుప్రసాద్‌కి ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. కాణిపాకం దేవస్థానంలో చక్కటి పాలన, పారిశుధ్యం విషయంలో తీసుకుంటున్న చర్యలు, సజావుగా సాగుతున్న అన్నదాన వితరణ వంటి అంశాలు కాణిపాకం దేవస్థానానికి ఈ సర్టిఫికెట్ తెచ్చిపెట్టాయి.