దసరా పండుగ అనగానే ఏపీలో గుర్తొచ్చే పేరు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు. ఇక్కడ దసరా పండుగ రోజు మాల మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ కర్రల సమరం నిర్వహించడం ఆనవాయితీ. దీనినే స్థానికంగా బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. పండుగ రోజున భక్తులంతా రెండు వర్గాలుగా చీలిపోయి మరీ కర్రల సమరం నిర్వహిస్తారు. పండుగ నాడు మాల మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లడంలో ఈ సమరం ప్రారంభమవుతుంది.
ఈ కర్రల సంబరంలో రక్తం చిందుతున్నా వెనుకడుగు వేయకుడా సమరం కొనసాగిస్తారు. కొందరి తలలు పగులుతాయి. సమరంలో వాడే దివిటీల నుంచి నిప్పు రవ్వలు పడి , తొక్కిసలాటలో కిందపడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా సరే.. ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాన్ని దేవరగట్టు వాసులు వీడటం లేదు. పోలీసులు సైతం దేవరగట్టులో భారీ ఎత్తున బందోబస్తును సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 12న దసరా పండుగ. ఇక బన్నీ ఉత్సవం ఆరోజు అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. ఉత్సవానికి 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించున్నారు.