ఏడుపాయల వన దుర్గామాత ఆలయం మూసివేత

మెదక్‌ జిల్లా ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని అర్చకులు, అధికారులు మూసివేశారు. దీనికి కారణం ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న వర్షాలే. ఈ భారీ వర్షాల కారణంగా వరదనీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలోనే సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అమ్మవారి ఆలయం ఎదుటే మంజీరా నది ఉంటుంది. సింగూర్ గేట్లను ఎత్తడం వలన మంజీరాకు వరద నీరు పోటెత్తింది. దీనికంటే ముందుగానే జాగ్రత్త చర్యల్లో భాగంగా వన దుర్గామాత ఆలయాన్ని మూసివేశారు.

అలాగే ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం వైపుగా ఎవరూ వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే ముందుగా అర్చకులు ఆలయాన్ని సంప్రోక్షణ చేయనున్నారు. ఆపై ఆలయాన్ని పునఃప్రారంభిస్తామని ఆలయ సిబ్బంది వెల్లడించారు. అలాగే ప్రస్తుతం ఆలయాన్ని మూసి వేసిన కారణంగా రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్న విషయాన్ని భక్తులు గమనించాలని ఆయన సిబ్బంది తెలిపారు.

Share this post with your friends