ధ్వజారోహణంలో శ్రీవారికి నైవేద్యంగా కట్టెపొంగలి.. దానిని స్వీకరిస్తే..

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టం ధ్వజారోహణం గురించి తెలుసుకున్నాం కదా. ధ్వజారోహణం ద్వారా ముక్కోటి దేవతలకు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వాన పత్రం పంపుతారు. ఈ ఆహ్వాన పత్రాన్ని అందుకున్న ముక్కోటి దేవతలు తప్పక తిరుమల కొండకు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తారని వేంకటాచల మహత్యం పేర్కొంటోంది. ధ్వజారోహణం అనంతరం శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవి సమేతుడై పెద్ద శేష వాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తాడు.

అయితే ధ్వజారోహణంలో అత్యంత ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. అదేంటో తెలుసుకుందాం. ధ్వజారోహణం సందర్భంగా అగ్నిగుండం ముందు వాస్తు హోమం నిర్వహించి అనంతరం కట్టె పొంగలి ప్రసాదాన్ని నివేదించి దానిని అందరికీ పంచిపెడతారు. ఈ ప్రసాదం మహిమ ఏంటంటే.. సంతానం లేనివారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే తప్పక సంతాన యోగం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల ధ్వజారోహణంలోనే కాదు.. చిలుకూరు బాలాజీ ఆలయంలోనూ గరుడ ప్రసాదాన్ని పంచుతారన్న విషయం తెలిసిందే. ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించేందుకు సంతానం లేని మహిళలంతా పెద్ద ఎత్తున ఇక్కడకు తరలివస్తారు.

Share this post with your friends