విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు కనువిందు చేస్తోంది. ఈ సందర్భంగా అమ్మవారు నాలుగో రోజు అయిన నేడు లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులను కటాక్షిస్తున్నారు. త్రిపురత్రయంలో అమ్మవారిని రెండో శక్తి స్వరూపిణిగా భక్తులు కొలుచుకుంటారు. దుర్గమ్మను కొలిస్తే కష్టాలు తొలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తులు నమ్మకం. అందుకే రెండో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని కొలుచుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.
ఎరుపు, నీలం రంగు చీరలో లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు మెరిసిపోతున్నారు. కుడివైపున లక్ష్మీదేవి, ఎడమ వైపున సరస్వతీదేవి సేవలు అందిస్తున్నారు. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి ఓంకార రూపిణి అయిన అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక ఇవాళ లలితా త్రిపుర సుందరీ దేవికి నైవేద్యంగా పులిహోర సమర్పిస్తే చాలా మంచిదట. అలాగే అమ్మవారికి ఏమైనా వస్త్రాన్ని సమర్పించేవారు ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలని.. అలాగే బంగారు రంగు చామంతులతో అమ్మవారిని పూజించాలని అర్చకులు చెబుతున్నారు.