
తిరుమలలోని పలు విభాగాలకు దాతలు దాదాపుగా నిత్యం ఏదో ఒక విరాళాన్ని అందజేస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి చాలా కాలం తరువాత అఖండాలు విరాళంగా అందిన విషయం తెలిసిందే. దాదాపు 300 ఏళ్ల తరువాత ఈ అఖండాలను శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి అందించారు. ఒక్కో అఖండం 50 కిలోల బరువు ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేసింది.
హైదరాబాద్‌కు చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ శ్రీ సత్య రోహిత్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఒక పూట మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.
