నవరాత్రులను పదవరోజుతో ఎందుకు ముగిస్తారో తెలుసా?

లోకంలోని ప్రతి అమ్మా ఆ లోకంలోని జగదంబకి ప్రతిరూపం. ఈమె కనిపిస్తుంది. ఆమె కన్పించదు. ఈమె ఎలాగైతే తొమ్మిది నెలలపాటు తనలో జరిగే వ్యాధులూ అలజడీ… తోపోరాడి 10వ నెలలో సంతాన విజయాన్ని సాధిస్తోందో– అలా అమ్మ ఈమెకి మార్గదర్శకురాలిగా తొమ్మిది రాత్రులపాటు (రాక్షసులకి రాత్రే బలం అధికం. నిశాచరులు కదా) పోరాడి పోరాడి 10వ నాడు దశమి విజయాన్ని సాధించింది కాబట్టి దేవీ నవరాత్రులంటే ప్రతి స్త్రీ విజయానికీ సాక్ష్యమన్నమాట. సంతానాన్ని కనగలగడమంటే అమ్మ అనుగ్రహంతో జయాన్ని సాధించి పండంటి బిడ్డని పొందడమన్నమాట. జయమంటే గెలుపు. అమ్మ అనుగ్రహం దానికి అండగా నిలిస్తే అది విజయం అన్నమాట!

రోజూ అమ్మకి కొత్తకొత్తగా ముస్తాబు…

అమ్మ అలంకారాల విషయానికి వద్దాం… స్థూలంగా చెప్తే– యోగసాధన చేయదలచిన సాధకుడు మొదటి రోజున బాల్య స్థితిలో ఉంటాడు. అదే బాలా త్రిపుర సుందరీ రూపం. అమ్మ తన సంతానాన్ని బడికి పంపేముందు కడుపునిండుగా అన్నం పెట్టి పంపుతుంది. అదుగో అదే అన్నపూర్ణా రూపం. సంతానం బడికెళ్లాక మూడవ కన్నయిన జ్ఞానాన్ని పొందుతారు. అదే గాయత్రీ రూపం. గాయత్రీ మంత్రానుష్ఠానం సాగగానే ఆ వ్యక్తికి ఓ వాక్ఛక్తి వచ్చి, అతడు ఏం చెప్తే అది జరగడం ప్రారంభమౌతుంది. ఆ శక్తిని ధనార్జనకి ఉపయోగిస్తాడా? లేక పై చదువుకోసం వినియోగిస్తాడా? అని పరీక్షించడం కోసం 4వ రోజున పరీక్ష కోసం మహాలక్ష్మీ రూపం వేస్తారు. ఆ ఆలోచనని జయిస్తే సరస్వతి, లక్ష్మి ఇతర దేవతలూ… ఇలా అందర్నీ శాసించగల లలితారూపాన్ని దర్శించేలా 5వ రోజున లలితా రూపాన్ని వేస్తారు. ఆరవ రోజున షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉండే కారణంగా సరస్వతీ రూపాన్ని వేయించి జ్ఞాన అజ్ఞానాలకీ, విరోధం విచక్షణం అనే రెంటికీ మూలమైన శక్తిని తెలుసుకునేలా చేస్తారు.

7వ రోజున వివాహిత అయిన స్త్రీ తన భర్తతో కలిసి ఉన్నప్పుడే భోగాన్నీ (మానసికానందం) పొందగలదని ఉపదేశిస్తూ భవానీ రూపాన్ని వేస్తారు. 8వ రోజున ఎంతటి కష్టానికైనా అండగా ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ దుర్గారూపాన్నీ– 9వ రోజున శత్రువుని ఎదుర్కొనే సాహసాన్ని ప్రతి స్త్రీ కలిగి ఉండాలనే దృష్టిని నేర్పుతూ మహానవమి నాడు క్రోధ రూపిణి అయిన కాలి రూపాన్నీ– 10వ రోజున మహిసాసుర మర్దినీ రూపాన్నీ (జాడ్యం బద్ధకం నిర్లక్ష్యం సిగ్గులేనితనం.. వంటి లక్షణాలని తొలగించగల) వేస్తారు.

Share this post with your friends