హోలీ పండుగకు మగవారంతా ఆడవారిగా మారిపోయేది ఎక్కడో తెలుసా?

హోలీ పండుగను రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున దేశమంతా జరుపుకుంది. ఒకరోజు కామ దహన కార్యక్రమం, మరో రోజు హోలీ వేడుకను దేశమంతా అత్యంత వైభవంగా నిర్వహించుకుంది. ఎక్కడైనా జరిగేవి ఇవే. కాముని దహనం, రంగులు చల్లుకోవడం. కానీ ఒకచోట మాత్రం ప్రత్యేకం. అక్కడ వెరైటీగా హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు.. ఇక్కడ ఓ వింతైన ఆచారం కొనసాగుతోంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామస్థులు హోలీ పండుగ వేడుకల్లో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు.

సంతేకుడ్లూరు గ్రామంలోని పురుషులంతా రెండు రోజులపాటు మహిళల మాదిరిగా మారిపోయారు. చక్కగా చీర కట్టుకుని.. గాజులు, నగలు ధరించి అందంగా ముస్తాబవుతారు. ఈ విధంగా వింత ఆచారంతో అక్కడి ప్రజలు పండుగను నిర్వహించుకుంటారు. మగవారంతా మహిళల వేషధారణ చేసుకున్నాక ఏం చేస్తారనేగా మీ సందేహం? మగవారంతా కలిసి ఆడవారి వేషంలో రతి మన్మథుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దశాబ్దాలుగా గ్రామస్థులంతా కలిసికట్టుగా ఈ హోలీ పండుగ చేసుకోవడం విశేషం. ఇలా పురుషులు ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకుంటే గ్రామంలో కరవు, కాటకాలు రావని ప్రజల నమ్మకం.

Share this post with your friends