హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలో తెలుసా?

హనుమాన్ జయంతి ఈ నెల 12న రానుంది. ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి రోజున ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ రోజున హనుమంతుడితో పాటు సీతారాములను కూడా పూజించడం ఆచారం. ఈ పవిత్రమైన రోజున ఎలా పూజలు చేయాలో తెలుసుకుందాం. ఏప్రిల్ 12న బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, శుచిగా స్నానం చేయాలి. అనంతరం పూజకు ముందుగా ఎర్రటి వస్త్రాలను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంకా ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్వామివారి చిత్రపటాన్ని సిద్ధం చేసుకోవాలి.

హనుమంతుడికి సింధూరం (కుంకుమ) పెట్టి.. ఎర్రటి పూలు, తులసి దళాలను సమర్పించి పూజించుకోవాలి. హనుమాన్ జయంతి నాడు చాలా మంది తప్పనిసరిగా తమలపాకుల దండ లేదా వడ మాలను సమర్పించాలి. ఆపై సింధూరం, తమలపాకులను సైతం హనుమంతుడికి సమర్పించి అష్టోత్తరం చదువుతూ ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. చివరగా హనుమంతుడికి హారతి ఇచ్చి ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా శనగలు, బూందీ లడ్డు, అప్పాలు వంటి ప్రసాదాలను అందరికీ పంచాలి. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతిని జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends