
పైడితల్లి అమ్మవారి కథ గురించి తెలుసుకున్నాం కదా. చెరువు నుంచి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసిన పతివాడ వంశీయులే ఇప్పటికీ ఈ ఆలయ పూజారులుగా కొనసాగుతున్నారు. ఆసక్తికరంగా సిరిమాను ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ స్వయంగా పైడిమాంబే చూసుకుంటుందట. ఈ ఉత్సవానికి నెల రోజుల ముందుగానే అమ్మవారు ఆలయ పూజారికి కలలో కనిపిస్తుందట. సిరిమాను చెట్టు ఎక్కడుందో చెబుతుందట. అమ్మవారు చెప్పిన ప్రకారం వెళ్లి అమ్మవారు సూచించిన చింతచెట్టునే సిరిమానుగా ఉపయోగిస్తారు.
ముందుగా ప్రజలంతా అక్కడకు చేరి సిరిమానుపై పసుపు నీళ్లు చల్లిన తర్వాత నిపుణులైన వడ్రంగులు సిరిమానును చెక్కుతారు. అనంతరం ఈ సిరిమాను విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల జంక్షన్ నుంచి కోట వరకూ మూడు సార్లు తిరుగుతుంది. కోట బురుజు దగ్గర పైడితల్లి అమ్మవారిని రాజ కుటుంబీకులతో పాటు ప్రముఖులంతా దర్శించుకుంటారు. సిరిమానోత్సవంలో బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం స్పెషల్ అట్రాక్షన్. ఇక ఉత్సవం పూర్తయ్యాక సిరిమానును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. దానిని భక్తులకు ప్రసాదంగా పంచి పెడతారు. ఆ ప్రసాదాన్ని భక్తులంతా తమ ఇంట్లోని పూజా మందిరంలో పెడతారు. పొలాలు ఉన్నవారు.. విత్తనాలతో పాటు ప్రసాదాన్ని కలిపి పొలంలో చల్లుతారు. ఇలా చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయట.
