వినాయక చవితి అంటే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆయన ఎలా ఉంటాడో చూడాలని అనుకోని భక్తుడు ఉంటడు. వివిధ రాష్ట్రాల నుంచి సైతం వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుంటారు. 70 అడుగుల ఎత్తులో వినాయకుడిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవడం లేదు. సప్తముఖ మహాశక్తి రూపంలో లంబోదరుడు భక్తులను కరుణిస్తున్నాడు. ఇక ఈ గణపతిని ఎలా రూపొందించారంటే.. కుడివైపున శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణ ప్రతిమలతో ఓ అద్భుతంగా గణేషుడు దర్శనమిస్తున్నాడు.
అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముడు, రాహువు, కేతువు సైతం ఖైరతాబాద్ వినాయకుడిలో ప్రతిష్టించారు. గతంలో రూపొందించిన సప్తముఖ మహా గణపతికి భిన్నంగా ఇప్పుడు లంబోదరుడు దర్శనమిస్తున్నాడు. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగ సర్పాలతో వినాయకుడిని చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. ఖైరతాబాద్ గణేశుడికి పద్మశాలి సంఘం 75 అడుగుల జంజం, 50 అడుగుల కండువాను సమర్పించింది. ప్రజలకు ఆయురారోగ్యాలు కలిగేలా సప్తముఖాలతో గణపతి ఆశీర్వాదాలు అందజేస్తున్నాడు. ఈ మహాగణపతి ప్రతిమను రాజేంద్రన్ అనే శిల్పి తయారు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజ జరగనుంది.