శ్రీశైలంలో ఉబ్బిలి బసవన్న గురించి తెలుసా?

పూర్వం శ్రీశైల ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహా విశ్వకర్మ వంశోద్భవుడు, మహా శివభక్తుడైన బసవాచార్యుడను ఒక శిల్పాచార్యుడు ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని సేవించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరిన శిల్పి సదా ఆలయాన్ని గురించే ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయటా కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకున్నాడు. ఉత్సాహంతో పని ప్రారంభించాడు. శిల్పి నక్త వ్రతాన్ని(పొద్దున్నించి భోజనం చేయకుండా రాత్రి శివపూజ చేసి భుజించడాన్ని నక్తం అంటారు) పాటిస్తూ నలభై రోజులలో రెండు మహత్తరమైన నందులను తయారు చేశాడు.

కవలపిల్లల్లా ఒకే రూపుతో ముచ్చటగా ఉన్న నందులను చూసి ఆనందించాడు. కానీ ఒక్కటే సందేహం.. ఆ నందులను శ్రీశైలానికి ఎలా చేర్చాలన్నదే అతని బాధ. మధ్యలో పాతాళగంగను కూడా దాటాలి. దీంతో నందులను శ్రీశైలం ఎలా తీసుకెళ్లాలో తెలియక విచారంలో మునిగి పోయాడు. నిద్ర కూడా పట్టలేదు. అర్ధరాత్రి గడిచాక మత్తు వచ్చినట్లు శిల్పి కళ్లు మూసుకున్నాడు. అప్పుడు కలలో శ్రీ మల్లికార్జున స్వామివారు కనిపించి పలుపు తాళ్లనిచ్చి నందుల మెడకు తగిలించమని చెప్పాడు. వెనుతిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకోమని చెప్పాడు. వెంటనే కళ్ళు తెరవగా ఎదురుగా పలుపు తాళ్లు కనిపించాయి. వాటిని నందుల మెడకు తగిలించి తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారుజామున పాతాళగంగకు చేరుకుని కృష్ణానదిని దాటాడు. రెండవ ఒడ్డుకు చేరబోతుండగా ఒక వెనుకనున్న నంది నీళ్లలోని రాళ్ల మధ్య ఉండిపోయి ఎంత లాగినా రాలేదు. ఊబి నుంచి కాలు పైకి లాక్కుంటూ అక్కడే శిలగా మారింది. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నది ఆ మహాశిల్పి చేసినదేనట. ఈ నంది ఊబి నుంచి బయటకు రాలేదు కాబట్టి ఉబ్బిలి బసవన్న అని పిలుస్తారు.

Share this post with your friends