
నారద జయంతి గురించి కొన్ని విషయాలను ఇప్పటికే తెలుసుకున్నాం కదా. నారాయణ భక్తుడే కాకుండా.. గొప్ప పండితుడు కూడా అని చెప్పుకున్నాం. ఇప్పుడు నారదుడు రచనల గురించి తెలుసుకుందాం.ఆయన రచించిన నారద పురాణం ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథం. అలాగే ఆయన రచించిన 84 సూత్రాలు ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో విశిష్టమైనవి. ఈ 84 సూత్రాల ద్వారా నారదుల వారు..అసలు పరిపూర్ణమైన భక్తి లక్షణాలు.. అవి ఎన్ని రూపాలుగా ఉంటాయి? వాటిని సాధించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే విషయాలతో పాటు.. భక్తి మార్గంలో ఎదురయ్యే పరీక్షలను సైతం పొందుపరిచారు.
నారద జయంతిని ముఖ్యంగా విష్ణు భక్తులు ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఉపవాసం ఉంటారు. నారద మహర్షితో పాటు విష్ణుమూర్తిని సైతం నేడు పూజిస్తారు. నారద మహర్షి పూజను స్వచ్ఛమైన హృదయంతో.. పవిత్రమైన మనసుతో పూజించాలి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఈ రోజున నారదుడిని పూజిస్తే సంగీత జ్ఞానం, తెలివితేటలు వృద్ధి చెందుతాయట. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం వలన మోక్షం సిద్ధిస్తుందట.
