టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా దివాక‌ర్ రెడ్డి ప్ర‌మాణం

తిరుమ‌ల‌ తిరుపతి దేవస్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా తుడ ఛైర్మ‌న్ శ్రీ దివాక‌ర్ రెడ్డి శుక్ర‌వారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ దివాక‌ర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం అద‌న‌పు ఈవో శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాలు, చిత్ర‌ప‌టాన్ని అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈఓ శ్రీమతి ప్ర‌శాంతి, విజిఓ శ్రీ సురేంద్ర‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

వేసవి సెలవులతో పాటు వీకెండ్ కూడా కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం నుంచే తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీంతో శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి బయట శిలాతోరణం వరకూ భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు టీటీడీ ఎప్పటికప్పుడు అన్నప్రసాదం, పాలు, టీలను అందిస్తోంది. దర్శక టికెట్లు లేని భక్తుల స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది.

Share this post with your friends