తిరుపతిలోని వైకుంఠ ద్వారదర్శన ఎస్ఎస్‌డి టికెట్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి కోలుకున్న 28 మంది భక్తులకు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠద్వార దర్శనం కల్పించింది. జనవరి 11వ తేదీ రాత్రి క్షతగాత్రులకు పరిహారం అందజేసి, గాయపడి కోలుకున్న వారికి ప్రత్యేక దర్శనం చేయించాలని టిటిడి చైర్మన్ శ్రీ బివి నాయుడు అధికారులను అదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైర్మన్ అదేశాల మేరకు, ఆదివారం బాధిత భక్తులకు టీటీడీ ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం చేయించింది.
ఈ సందర్భంగా బాధిత భక్తులు మాట్లాడుతూ, ప్రభుత్వం, తిరమల తిరుపతి దేవస్థానం బోర్డు, అధికారులు తమను చాలా జాగ్రత్తగా చూసుకున్నారన్నారు. మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చేశారని వెల్లడించారు. వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రత్యేకంగా చేయించినట్లు చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. పరిహారం అందించి, తిరిగి తమ గమ్యస్థానలకు చేరుకునే ఏర్పాట్లు చేసిన రాష్ట్ర సీఎం శ్రీ చంద్రబాబు నాయుడుకి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.