
బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రులు ముగిశాయి. అయినా కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి పోటెత్తుతున్నారు. దసరా నవరాత్రి వేడుకలు ముగిసిన తర్వాత కూడా ఇంకా ఇంద్రకీలాద్రికి భక్తులు తగ్గడమే లేదు. నిన్న ఆదివారం.. సెలవులు కూడా నిన్నటితో ముగియనుండటంతో రాత్రి వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. ఇక ఆలయ అధికారులు సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తకుండా ఏర్పాట్లు నిర్వహించారు. వృద్ధులు, వికలాంగులతో పాటు పసిపిల్లల తల్లుల కోసం లిఫ్ట్ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం వారు ఇబ్బంది పడకుండా చూసేందుకు ఎక్కడికక్కడ సిబ్బందిని పెట్టారు.
దుర్గమ్మ దర్శనం కోసం పెద్ద ఎత్తున భవానీ దీక్షాదారులు తమ కుటుంబాలతో కలిసి మరీ తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణమంతా దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతోంది. అనంతరం దీక్షదారులు ఇక్కడే దీక్ష విరమణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఘాట్లలో పెద్ద ఎత్తున దుస్తులు పోగవుతున్నాయి. వాటిన్నింటినీ ఎప్పటికప్పటికీ తీసేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూస్తున్నారు. గతేడాది దసరా నవరాత్రుల్లో భవానీ భక్తులు సహా 12 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకోగా.. ఈ ఏడాది 15 లక్షలు దాటినట్టు అధికారులు చెబుతున్నారు. కేవలం మూలా నక్షత్రం ఒక్కరోజే 1.95 లక్షల మంది భక్తులు వచ్చినట్టు అంచనా.
