ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు పోటెత్తిన భక్తజనం..

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నిన్న వీకెండ్ పైగా ఆదివారం కావడంతో ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా కూడా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మహా నిమజ్జనం జరిగే ఈ నెల 17 తేదీ అర్ధరాత్రి వరకూ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రతి గల్లీలోనూ వినాయకుడు కొలువుదీరాడు.

మరోవైపు వరంగ‌లో మొట్టమొదటిసారిగా ఖైరతాబాద్ వినాయకుడిని తలపించేలా వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఖైరతాబాద్ వినాయకుడి అంత ఎత్తు లేకున్నా కూడా ఈ గణపయ్య మట్టితో రూపొందాడు. 40 అడుగుల ఎత్తుతో మట్టి గణపతిని ప్రతిష్టాపించారు. ఖైరతాబాద్ వినాయకుడి స్ఫూర్తితోనే ఈ మట్టి గణపతిని రూపొందించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఖైరతాబాద్ వినాయకుడికి అతిపెద్ద విగ్రహంగా పేరు ఉందని, వరంగల్ ఉమ్మడి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లలేని భక్తులకు అందుబాటులో ఉండేలా 40 ఫీట్ల భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Share this post with your friends