వేస‌వి, వీకెండ్ నేపథ్యంలో తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్తులు..

వేస‌వి సెల‌వులు, పైగా వీకెండ్ కూడా కలిసి రావడంతో గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. ఈ క్రమంలో అన్ని విభాగాల అధికారుల స‌మ‌న్వ‌యంతో భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా టీటీడీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయ‌ణ‌గిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంత‌రాయంగా అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ ఏర్పాట్ల‌ను విస్తృతంగా చేపట్టింది. టీటీడీ యంత్రాంగం కృషితో శ‌నివారం రోజున 90,211 మంది భ‌క్తుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగింది.

మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంతో పాటూ ఇత‌ర అన్న‌ప్ర‌సాద కేంద్రాల్లో క‌లిపి 51 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ జ‌రిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లు, నారాయ‌ణ‌గిరి షెడ్లు, బయట క్యూలైన్లలో మరో 20 లక్షల మందికి పాలు, టీ, కాఫీ, మ‌జ్జిగ‌, స్నాక్స్ పంపిణీ చేశారు. మే నుంచి ప్రతిరోజూ సగటున 2.5 లక్షల అన్నప్రసాదాలు, 90 వేలకు పైగా అల్పాహారాలు, పానీయాలు అందిస్తున్నారు. మే 24న ఒక్కరోజే మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద కేంద్రంలో 93,950 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అదే రోజు బయట క్యూలైన్లు, వైకుంఠం ప్రాంతాల్లో 2.72 లక్షల అన్నప్రసాదాలు, 1.17 లక్షల పానీయాలు అందించారు.

Share this post with your friends