
నేటి నుంచి ‘దేవి త్రిరాత్ర వ్రతం’ ప్రారంభమైంది. అసలు‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటో తెలుసుకుందాం. అమ్మ దయతోనే సర్వ జగత్తు నడుస్తోంది. ఆమె కరుణ సముద్రం… అమృత హృదయం… ఆ తల్లి చల్లని చూపుల కోసం అఖిలాండాలు ఎదురుచూస్తుంటాయి. అందుకే తిథి, వారం, నక్షత్రాలు లేకపోయినా, ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు తల్లిని ఆరాధించినవారికి కోటిజన్మల పాపరాశి భస్మమవుతుంది. తీరని పుణ్యరాశి లభిస్తుంది అని దేవీభాగవతం చెబుతోంది. ఈ వ్రతరాజమే దుర్గాదేవి వ్రతం లేదా కుమారి పూజ. మనలోని అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని, రాత్రివేళ తల్లిని ఆరాధించడం సంప్రదాయం. అందుకే వీటిని ‘శరన్నవ రాత్రులు’ అని పిలుస్తారు.
దేవి తొమ్మిది రూపాలు..
మూడు కన్నులు, పదహారు చేతులతో షోడశభుజ దుర్గాదేవి
మహిషిపై సవారై బంగారు వర్ణంతో వనదుర్గాదేవి
రుద్రాంశంతో సింహవాహనంపై రుద్రాంశ దుర్గాదేవి
శూలిని దుర్గాదేవి – మణిమయ భూషణాలతో అలంకారముగా
అష్టభుజ, అగ్ని వర్ణంతో అగ్నిదుర్గాదేవి
జయదుర్గాదేవి – సింహవాహనంతో విజయప్రదంగా
వింధ్యావాసిని దుర్గాదేవి – బంగారు పద్మంపై ఆశీనురాలు
రిపుమారిణి దుర్గాదేవి – ఎర్రవర్ణ భయంకర స్వరూపిణి
విష్ణు దుర్గాదేవి – చక్రశంఖాల ధారిణి, అభయముద్రలతో ప్రసన్నముగా
ఈ తొమ్మిది రూపాలను ఆరాధించినవారికి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.
