
కడప జిల్లాలోని దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం, అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బాలాలయం జరుగనుంది. బాలాలయం కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆలయ గర్భాలయంలో, పోటు గదిలో వర్షం నీరు లీకేజీలు అవుతున్నాయి. అవి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ పాత వైర్ల స్థానంలో కొత్త వైర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలో పూర్తి మార్పులు చేర్పులు చేస్తున్నారు.
గర్భాలయంలో పైభాగాన ఉన్న కాలం చెల్లిన కొయ్య దంతెలను తొలగించే అంశం, ఆలయంలో అవసరమైన గ్రానైట్ పనులు, పోటు పెంపు, పీఏసీ వద్ద లిఫ్ట్ ఏర్పాటు, ఆలయం చుట్టూ రోడ్ల విస్తరణ, విలువైన వస్తువులు భద్రపరుచుకునేందుకు స్ట్రాంగ్ రూం ఏర్పాటు, భక్తులకు సౌకర్యవంతంగా పార్కింగ్, నూతన వాహన మండపం, తదితర మరమ్మతుల పనులను చేయిస్తున్నారు. ఒంటిమిట్టలోనూ అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరింతగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
