
దేశ వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్టు టీటీడీ ఈవో జే శ్యామలరావు వెల్లడించారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ఛర్ కన్సెల్టెన్సీల ద్వారా టీటీడీలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు నిర్మించేందుకు 26.09.2014లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. అందులో భాగంగా ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం జరిగిందన్నారు. ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ మిగిలిన నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయడం జరిగింది. వారి ఆమోదం మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణం చేపడతామని ఈవో తెలిపారు.
