మహాకుంభమేళాకు వచ్చే వారి కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వీఐపీల కోసం హోటళ్లతో పాటు కాటేజీలు, టెంట్‌లు మాత్రమే కాకుండా డోమ్‌లను సైతం ఏర్పాటు చేశారు. డోమ్‌లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ కొత్త సౌకర్యాన్ని ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ డోమ్‌లలో అన్ని రకాల వసతి సౌకర్యాలు, ఫైవ్ స్టార్ ఆతిథ్యం, హెలికాఫ్టర్ రైడ్ కూడా అందుబాటులో ఉంది. డోమ్‌ల నిర్మాణం రద్దీగా ఉండే ఘాట్‌లకు, సాధారణ యాత్రికుల తాత్కాలిక గుడారాలకు దూరంగా జరిగింది. ఈ అద్భుత ప్రపంచాలన్ని ఎలైట్ నిర్మించింది.
మహాకుంభ్‌లో అత్యంత ఖరీదైన వసతిగా డోమ్‌లను పేర్కొంటున్నారు. ఈ డోమ్ నుంచి రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ హాయిగా నిద్రించవచ్చు. అలాగే ఈ డోమ్‌లలో అద్దె కూడా ఫైవ్ స్టార్ హోటల్‌కు మించే ఉంది. షాహి స్నానం రోజున రూ.లక్ష 11వేలు, మిగతా రోజుల్లో రూ.81 వేలు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం ఓ కంపెనీ రూ.51 కోట్లు ఖర్చు చేసింది. దీనిని డోమ్ సిటీగా పేర్కొంటున్నారు. 18 అడుగుల ఎత్తులో గాజు పలకలు, కర్టెన్లతో ఈ నిర్మాణం జరిగింది. వీటిని తొలగిస్తే డోమ్ లోపల నుంచే మహా కుంభ్ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. మహాకుంభమేళాలో తొలిసారిగా ఇలాంటి డోమ్‌ల నిర్మాణం జరిగిందని అంతా చెప్పుకుంటున్నారు.