టీటీడీకి చెన్నైకి చెందిన ఇన్‌ఫ్రా వెంచర్స్ భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద మొత్తం విరాళంగా అందింది. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు గురువారం రూ.2.45 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకు చెందిన జినేశ్వర్ ఇన్‌ఫ్రా వెంచర్స్ సంస్థ టీటీడీ ఎస్‌వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించగా, శ్రీలంకకు చెందిన ఓ దాత అన్న ప్రసాదం ట్రస్టుకు మరో రూ.కోటి విరాళంగా అందించారు. నోయిడాకు చెందిన పసిఫిక్ బీపీవో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు, అదనపు ఈవో సిహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు.

30న‌ మహతిలో ఉగాది సంబరాలు

టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు మార్చి 30వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘ‌నంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదపారాయణం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌ముఖ పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. అనంత‌రం అష్టావధానం, టీటీడీ ఉద్యోగుల పిల్లలతో ”తెలుగు వైతాళికులు” వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.

Share this post with your friends