
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా, టోకెన్ జారీ కౌంటర్ల ద్వారా నమోదు చేసుకుని దర్శనం పొందాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇటీవల శ్రీ మలయప్ప స్వామివారి వీఐపీ బ్రేక్ టికెట్లు ఇప్పిస్తామని శ్రీ వనం నటరాజ నరేంద్ర కుమార్, శ్రీ కెఎస్. నటరాజ శర్మలు రూ 90,000 తీసుకుని మోసం చేసినట్లు హైదరాబాద్‌కు చెందిన వై. శ్రీ విశ్వనాథ్‌కు ఫిర్యాదు చేశారు. వై. శ్రీ విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు శ్రీ వనం నటరాజ నరేంద్ర కుమార్, శ్రీ కె.ఎస్. నటరాజ శర్మ లు వీఐపీ బ్రేక్ దర్శన టిక్కెట్లు ఇస్తామని చెప్పి 2024 ఆగస్టు 16వ తేదీ 12 మంది కోసం రూ.90,000/- వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి నుండి పలు మార్లు ఫోన్ చేసి తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పటికీ వారు స్పందించ లేదు.
వై. శ్రీ విశ్వనాథ్ ఫిర్యాదు తరువాత టీటీడీ విజిలెన్స్ విభాగం విచారణలో సదరు నిందితులు హైదరాబాద్ జంట నగరాలలో పలువురిని ఇలాగే మోసం చేస్తున్నారని, వీరిపై ఇప్పటికే దాదాపు 12 పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆరోపణలలో ఉన్న శ్రీ వనం నటరాజ నరేంద్ర కుమార్, శ్రీకెఎస్. నటరాజ శర్మలు టీటీడీ ఉద్యోగులు కాదు. వీరికి టీటీడీతో ఎలాంటి సంబంధం లేదు. భక్తుల నుంచి తరచూ నకిలీ దర్శన టికెట్ల బుకింగ్‌పై టీటీడీకి ఫిర్యాదులు అందుతున్నాయి. శ్రీవారి దర్శనం, వసతి కోసం అనధికార వెబ్ సైట్ లను ఆశ్రయించి వద్దని, టీటీడీ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని భక్తులకు సూచించింది. టీటీడీ సేవలకు సంబంధించి https://ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్డు ఆధారంగా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. టీటీడీ సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదించాలి. దళారులపై అనుమానం వస్తే టీటీడీ విజిలెన్స్ అధికారులు 0877-2263828 సదరు ఫోన్ నెంబర్ లో నిరంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్యాదు చేయాలని టీటీడీ సూచించింది.
