భారతసైన్యానికి దైవిక బలం కోసం చండీ సహిత రుద్ర హోమం

ఇండియా -పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల ఏరివేతకు భారత్ పూనుకుంది. ఈ క్రమంలోనే ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. ఈ క్రమంలోనే అన్ని ఆలయాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న విషయమై దేశమంతటా మాక్ డ్రిల్‌ను సైతం సైనికులు నిర్వహించారు.
ఈ క్రమంలోనే భారత్ తలపెట్టిన ఉగ్రవాదుల ఏరివేత విజయవంతం కావాలని, యుద్ధంలో పాల్గొంటున్న భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ కొన్ని ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

భారత సైన్యానికి దైవిక బలం కూడా తోడవ్వాలని.. అలాగే దేవతల సంపూర్ణ ఆశీస్సులు వారికి ఉండాలని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు తాజాగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అర్చకులు, వేద పండితులు శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే చండీ సహిత రుద్ర హోమాన్ని సైతం నిర్వహించడం జరిగింది. శౌర్యానికి, ధైర్యానికి ప్రతీకలైన భారత సైనికుల భద్రత, ఆరోగ్యం శ్రేయస్సును కాంక్షిస్తూ ఈ హోమాన్ని నిర్వహించారు. భారతావనితో పాటు మన సాయుధ దళాలకు సంపూర్ణ దిగ్విజయం చేకూరాలని ఆ పరమేశ్వరుడిని అర్చకులు కోరారు.

Share this post with your friends