పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమలలో బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకూ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి ఏటా రెండు సార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఒకసారి వైశాఖ మాసంలో, మరోసారి అశ్వయుజ మాసంలో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలను ఎనిమిది రోజుల పాటు జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు అయిన నేడు స్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరిస్తారు. ఈ అలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ నెల 17న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం, 18న ద్వారకా తిరుమలలోని మాఢ వీధుల్లో స్వామివారి రథోత్సవం వంటివి నిర్వహించనున్నారు. అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరిగే 8 రోజులపాటు స్వామివారు, అమ్మవారితో కలిసి వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిత్య ఆర్జిత కల్యాణాలు, సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుదరంగా ముస్తాబు చేశారు. భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.