3 నుంచి వాల్మీకిపురం శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంట‌ల‌ నుండి 9 గం.ల వరకు అంకురార్పణం, సేనాధిపతి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌వుతాయి. ఆలయ నేపథ్యం: శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి మహర్షికి దివ్యదర్శన భాగ్యాన్ని కలిగించిన ప్రదేశమే వాల్మీకి పురం. లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమంతునితో శ్రీ సీతా సమేతముగా పట్టాభిరాముని పరమ భక్తాగ్రణ్యులైన జాంబవంతులవారు ప్రతిష్టించినట్లుగా తెలియుచున్నది. వల్మీకము (పుట్ట) నుంచి శ్రీరామచంద్రమూర్తి బయటపడినందున ఈ ప్రదేశం వాల్మీకి పురంగా పేరొచ్చింది.

శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయ విమానం సుదర్శన విమానంగా ప్రసిద్ధి చెందింది. ఈ సుదర్శన విమానం చోళరాజుల శైలితోను, మండప ద్వార గోపురములు విజయనగర శైలితోను అత్యంత సుందరంగా నిర్మించబడింది. తొలి తెలుగు వాగ్గేయ కారులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వావిలిపాటి శ్రీ పట్టాభిరామునిపై 20కి పైగా కీర్తనలు రచించినట్లు తెలియుచున్నది. శ్రీ పట్టాభి రామాలయమును తిరుమల తిరుపతి దేవస్థానం వారు 23.02.1997వ తేదీన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి మరమ్మతులు జరిపి 12.08.2005వ తేదీన అష్టబంధన మహా సంప్రోక్షణ నిర్వహించారు.

Share this post with your friends