భక్తులకు బిగ్ అలర్ట్.. కుమారధార తీర్థ ముక్కోటికి వారికి అనుమతి లేదు

తిరుమలలో మార్చి 14న శుక్రవారం జరగనున్న కుమారధార తీర్థ ముక్కోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భక్తలకు టీటీడీ కీలక సూచన చేసింది. శుక్రవారం ఉదయం 5 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే కుమార‌ధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్న‌పిల్ల‌లు, వృద్ధుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్ల‌డానికి అనుమ‌తి లేదు. గోగ‌ర్భం నుండి పాప‌వినాశ‌నం వ‌ర‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో మాత్ర‌మే భ‌క్తుల‌ను అనుమ‌తిస్తారు. ట్రాఫిక్ ర‌ద్దీ దృష్ట్యా ప్ర‌యివేటు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌రు. ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని భక్తులను కోర‌డ‌మైన‌ది. పాపవినాశనం నుండి కుమార‌ధార‌ తీర్థం వరకు భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.

మార్గమ‌ధ్యంలో తాగునీటిని అందుబాటులో ఉంచుతారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాప‌వినాశ‌నం డ్యామ్ వ‌ద్ద ఉదయం 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగ‌లి, పులిహోర, సాంబార‌న్నం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్ర‌యివేటు సంస్థ‌లు, వ్య‌క్తులు అన్న‌దానం చేసేందుకు అనుమ‌తి లేదు. ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భ‌క్తుల‌కు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేస్తున్నారు.. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు అందుబాటులో ఉండేందుకు వీలుగా అంబులెన్స్‌లు, డాక్ట‌ర్లు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు.

Share this post with your friends