అలిపిరి శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా బాలాల‌యం

తిరుప‌తిలోని అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆలయం, శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మ‌వారి ఆల‌యంలో అష్ట‌బంధ‌నం కార‌ణంగా శ‌నివారం ఉద‌యం బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. మార్చి 3వ తేదీన పూర్ణాహుతితో ఈ కార్య‌క్ర‌మాలు ముగియ‌నున్నాయి. ఇందులో భాగంగా మార్చి 1న ఉద‌యం 8 గంట‌ల‌కు పుణ్యాహవచనం, వాస్తు హోమం, అక‌ల్మ‌ష హోమం, ర‌క్షాబంధ‌నం, ఇత‌ర వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంట‌ల‌కు కుంభ‌స్థాప‌న, క‌ళాక‌ర్ష‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, కుంభాల‌ను యాగశాల‌కు తీసుకొచ్చి వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

మార్చి 2వ తేదీ ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల‌లో పంచ గ‌వ్యాదివాసం, క్షేరాధివాసం, జలదివాసం నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. మార్చి 3వ తేదీ ఉదయం 8 గంట‌ల‌కు యాగ‌శాల వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, కుంభ ప్ర‌ద‌క్ష‌ణ నిర్వ‌హిస్తారు. ఉద‌యం 9.20 నుండి 9.55 గంట‌ల మ‌ధ్య మేష‌ ల‌గ్నంలో బాలాల‌య సంప్రోక్ష‌ణం చేప‌డ‌తారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు,వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌న రంగాచార్యులు, రుత్వికులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Share this post with your friends