ఏకశిలానగరి.. విశేషాల ఝరి.. ఇక్కడి కోదండ రామయ్య ఆలయం. ఇది ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. ఏక శిలపై సీతారామలక్ష్మణుల దివ్యదర్శనం ఎంత చూసినా తనివి తీరదు. ఒంటిమిట్ట రామయ్య ఆలయం చారిత్రక, రాచరిక ఘట్టాలకు నిలువెత్తు సాక్ష్యం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. చూసేందుకు రెండు కళ్లూ చాలవు. రామ, లక్ష్మణ తీర్థాలు ఇక్కడి మరో విశేషం. ఇక ఆసక్తి, ఆశ్చర్యం కలగలిపే విషయం ఏంటంటే.. ఇది హనుమ లేని రాముడి కోవెల.. ఇలా ఒంటిమిట్ట దివ్య క్షేత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అంతటా అద్భుతమైన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా బాలాలయం జరిగింది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం ఈ బాలాలయాన్ని వేద పండితులు, ఆలయ అర్చకులు నిర్వహించారు. క్రతువులో భాగంగా అగ్ని ప్రాణాయామం, కుంభారాధన, అకల్మష హోమం, మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయ మహా శాంతి ప్రోక్షణ నిర్వహించారు. డివైఈఓలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ ధార్మిక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.