
తిరుమల విషయమై ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో ఇస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల మిగిలిపోయాయంటూ సోషియల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. వాస్తవానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసేసుకుంటున్నారు.
ఏరోజు కూడా ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో ఆఫ్‌లైన్‌లో పదుల సంఖ్యలో తగ్గాయేకాని, కొందరు వ్యక్తులు సోషియల్ మీడియాలో గతవారం రోజుల్లో వందల సంఖ్యలో టికెట్లు మిగిలిపోయినట్లు ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవం. అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.
