
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో దేవేరుల సమేతుడై శ్రీ వేంకటేశ్వర స్వామి తరిస్తున్నాడు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇదిఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. కాగా బ్రహ్మోత్సవాలలో మూడో రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవలు జరుగుతాయి.
