
చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరగా.. తాను నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని సమాచారం. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి పాల్పడ్డారు. దీంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై 20 మంది దాడికి పాల్పడ్డారని రంగరాజన్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని.. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. అంతకు మించి మాట్లాడబోనని తెలపడంతో పాటు దాడి ఘటనను వివరించేందుకు సైతం రంగరాజన్ నిరాకరించారు.
చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారని.. వారు రామరాజ్యం స్థాపనకు మద్దతివ్వాలని కోరారని పోలీసులు తెలిపారు. అయితే దానికి రంగరాజన్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే రంగరాజన్‌తో పాటు అడ్డుకునేందుకు యత్నించిన ఆయన కుమారుడిపై సైతం సదరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఈ దాడి కేసుకు సంబంధించి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
