
ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దుచేసి, ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీని టీటీడీ నియమించింది. భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదాయంతో సంబంధం లేకుండా నిర్వాహకుల సామర్థ్యాన్ని బట్టి, పేరొందిన సంస్థలకు కేటాయించడానికి త్వరలోనే టెండర్లను పిలవాలని సైతం భావిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా, త్వరితగతిన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది. టీటీడీ భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుమలలో 12వేల చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు.
టీటీడీలో అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే పప్పు దినుసుల నాణ్యత పెంచేందుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఇందుకోసం రిలయన్స్ రీటైల్ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.
