27 నుంచి శ్రీకోదండరామస్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాలు.. టీటీడీ కీలక ఆదేశాలు

తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 04వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో వాల్ పోస్టర్లను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ.. తిరుపతి శ్రీకోదండరామ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవములు ఈ నెల 27 నుంచి ఏఫ్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్నాయని, అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవములు ఏప్రిల్ 06 నుంచి ఏప్రిల్ 08 వరకు, తెప్పోత్సవములు ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరుగనున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ అధికారులను ఈవో ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని ఆయన సూచించారు. అదేవిధంగా, వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదిన మేషలగ్నంలో ఉదయం 9.15 గంటల నుండి 9.30 గం.ల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 03వ తేదీన ఉదయం 9.15 గం.లకు రథోత్సవం, ఏప్రిల్ 07వ తేదీన రాత్రి 07 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని, భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు.

Share this post with your friends