
కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 19 నుంచి జరుగనున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 18వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 7.30 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్ కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 28వ తేదీన మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
