
శ్రీవేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ పనితీరును టీటీడీ ఈవో సమీక్షించారు. టీటీడీ వెబ్‌సైట్‌లోని ప్రత్యేక యూట్యూబ్ చానెల్‌లో తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తలను అన్నింటినీ ఒకేచోట ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అన్నమయ్య సంకీర్తనలలో ఇప్పటికే బాగా పాపులర్ అయిన వాటిని ముందుగా పొందు పరిచి, దశల వారీగా అన్ని సంకీర్తనలను అందులో పొందుపరచాలని సూచించారు. కొత్త సంకీర్తలు బాగా పాపులర్ అయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. అన్నమయ్య 32 వేల సంకీర్తనలలో 14, 932 సంకీర్తలు లభ్యమయ్యాయి. అందులో ఇప్పటి వరకు ఎన్ని సంకీర్తనలను రికార్డు చేశారు, ఇంకా ఎన్ని రికార్డు చేయాల్సి ఉంది.
అన్నమయ్య కీర్తనల ప్రత్యేక వెబ్ పేజీలో ఎన్ని సంకీర్తనలు అప్ లోడ్ చేశారు. ఇంకా ఎన్ని చేయాల్సి ఉందో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. అనంతరం టీటీడీ పబ్లికేషన్ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. టీటీడీ ముద్రించిన అన్ని పుస్తకాలు టీటీడీ బుక్ స్టాల్స్‌లో లభ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు, యువతకు అర్థవంతంగా, సులభతరంగా ఉండేలా కథనాలు రాసి ముద్రించాలన్నారు. ఇప్పటి వరకు టీటీడీ ఎన్ని పుస్తకాలను ముద్రించింది, టీటీడీ ఈ బుక్స్‌లో ఎన్నింటిని అప్ లోడ్ చేశారో వివరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విశేష ఆదరణ పొందిన పుస్తకాలను ముద్రించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
