దేవీ నవరాత్రుల వేళ మహానంది ఆలయానికి అనుకోని అతిథి..

దేవీ శరన్నవరాత్రుల నేపథ్యంలో అన్ని ఆలయాలకూ భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకోని అతిథులు కూడా వచ్చి సందడి చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో నాగుపాము సంచారం కలకలం రేపింది. ఈశ్వరుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆ క్యూలైన్‌‌కు సమీపంలోనే అకస్మాత్తుగా నాగుపాము దర్శనమిచ్చింది. దానిని చూసిన భక్తులు ఒకింత భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆలయ సిబ్బందికి సమాచారం అందించారు.

అక్కడకు చేరుకున్న ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆలయానికి వచ్చిన స్నేక్ స్నాచర్.. నాగుపామును చాకచక్యంగా పట్టుకొని సంచిలో తీసుకెళ్లి సమీపంలోని నల్లమల అడవిలో వదిలిన పెట్టాడు. మొత్తానికి నాగుపామును పట్టుకోవడంతో భక్తులు శాంతించారు. ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు, ఆలయ సిబ్బంది ఒకింత ఆందోళనకు గురైనా కూడా నవరాత్రుల వేళ శివాలయానికి నాగు పాము రావడం అనేది శుభ సంకేతంగా భావిస్తున్నారు. శివయ్యే ఇలా తమకు దర్శనమిచ్చాడని భక్తులు భావిస్తున్నారు.

Share this post with your friends