
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణం వెనుక కథేంటో తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఆలయ నిర్మాణ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన గురించి తెలుసుకుందాం. మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడిన బావిని పునరుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ భాగ్యనగరానికి తలమానికంగా నిలిచింది. అమ్మవారి ఆలయం ఎప్పుడు భక్తులతో సందడిగా ఉంటుంది. బోనాలు జరిగే రెండు రోజులు ఆలయ పరిసరాలన్నీ సుందరంగా తీర్చి దిద్దడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా అత్యంత సుందరంగా ఆలయంతో పాటు ఆలయ పరిసరాలను అలంకరించారు. పండుగ సందర్భంగా వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనల హోరుతో, భక్త జనసంద్రంతో పండుగ వాతావరణం కళతో సికింద్రాబాద్ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంటుంది.
