ముత్యపుపందిరిపై ఆదిలక్ష్మి అలంకారంలో అల‌మేలుమంగ‌.. సేవించిన వారికి కైవల్యం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల్లో మూడో రోజైన శనివారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభ‌మైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు.

తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం చేకూరుతుందని విశ్వాసం.
మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, గంధంతో అభిషేకం చేస్తారు. కాగా సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. వాహనసేవల్లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఈవో జె శ్యామల రావు, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాబు స్వామి, టెంపుల్‌ ఇన్స్పెక్టర్లు శ్రీ సుభాష్‌, శ్రీ చలపతి పాల్గొన్నారు.

Share this post with your friends