
వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తిరుమల మొత్తం తిరుగుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులను వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం వేకువజామున దర్శన క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కృష్ణతేజ విశ్రాంతి భవనం వద్ద క్యూలైన్లలో శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, తాగునీటిపై ఆరా తీసి తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై భక్తుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈవో ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో అదనపు ఈవో వెంట డిప్యూటీ ఈవో (హెల్త్) శ్రీ సోమన్ నారాయణ ఉన్నారు.
