
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు శ్రీ చిన తిరుమలయ్య పునరుద్ధరించినారు. ప్రకృతి వైపరీత్యాలకు యవనుల దండయాత్రలకు లోలై శిథిలమైన ఈ గుడి, గోపురాలను పునర్నిర్మించి శ్రీవేంకటేశ్వర స్వామి వారికి నిత్యపూజా నైవేద్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు, ఊరేగింపులను చినతిరుమలయ్య నిర్వహించినట్లు 22 మార్చి, 1540 సంవత్సరం నాటి శాసనం చెబుతోంది. అర్చకులు సుందరాజ స్వామివారి నుంచి 1967లో తిరుమల తిరుపతి దేవస్థానములు వారు చేపట్టి శ్రీవైఖానస ఆగమోక్తంగా దేవాలయ పునరుద్ధరణ, భక్తులకు వసతులు, నిత్య దిట్టం ఏర్పాటు చేసి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 1981 నుండి శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం, సాక్షాత్కార, బ్రహ్మోత్సవ వైభవాలను నిర్వహిస్తున్నారు.
3న పార్వేట ఉత్సవం
జూలై 03వ తేదీన ఆలయంలో పార్వేట ఉత్సవం నిర్వహించనున్నారు. ఉదయం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన, శాత్తుమొర, అనంతరం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 – 02 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేది వరకు నిత్య కళ్యాణోత్సవం, జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం, జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు.
