
తిరుమల ఆనంద నిలయంలో శ్రీ మలయప్ప స్వామివారి మూల విరాణ్మూర్తి, ఇతర ఉత్సవమూర్తులతో పాటు, ప్రత్యేకంగా నాలుగు పెద్ద సాల గ్రామాలు, ఇంకా కొన్ని చిన్న సాలగ్రామాలు నిత్యాభిషేకాలు, అర్చనలు అందుకుంటూ ఉన్నాయి. ఈ సాలగ్రామాలన్నీ శ్రీస్వామివారి పాదాల చెంత వెండి పాత్రల్లో ఉంచబడి పూజింపబడుతూ ఉన్నాయి. ప్రతిరోజూ భోగ శ్రీనివాసమూర్తితో పాటు ఈ సాలగ్రామాలకు అభిషేకం జరిగిన తర్వాత అన్ని మూర్తులతోపాటు ఈ సాలగ్రామాలకు పుష్పార్చన, నివేదన జరుపబడుతున్నది.
ఇలా పూజలందుకొంటూ వున్న సాలగ్రామాలు మాత్రమేకాక, శ్రీ స్వామివారి దివ్య మూలవిరాణ్మూర్తికి ఇరువైపులా రెండు భుజాల నుండి పాదాల వరకూ వేలాడుతున్న దివ్య సాలగ్రామ హారాలు నిత్యశోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. బంగారు కవచాలలో పొదుగబడి కూర్చబడిన ఈ రెండు సాలగ్రామ హారాలు మాత్రమే కాకుండా పూర్వం ప్రసిద్ధ ద్వైత సంప్రదాయ పీఠాధిపతులైన శ్రీవ్యాసతీర్థులవారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి సాలగ్రామహారం సమర్పించినట్లు తెలుస్తున్నది.
