ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొక ప్రమాదం జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. మహా కుంభమేళాలో అగ్ని ప్రమాదం, ఆ తరువాత మౌని అమావాస్య సందర్భంగా సంగం ఘాట్‌లో తొక్కిసలాట, ఆ కాసేపటికే ఝాసీ ఘాట్‌లో తొక్కిసలాట, తాజాగా పిపా వంతెన విరిగిపోవడం జరిగింది. నిన్న (జనవరి 31) మధ్యాహ్నం పవిత్ర సంగం ప్రాంతం వెలుపలి ఫఫామౌ ప్రాంతంలో గంగా నదిపై నిర్మించిన పిపా వంతెన ఒక్కసారిగా విరిగిపోయింది. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మౌని అమావాస్య రోజు నుంచి మహాకుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానానికి తరలివస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ మొత్తం ఎక్కడ చూసినా జన సందోహంతో కిక్కిరిపోతోంది. వీరంతా బసంత్ పంచమి స్నానానికి సంగం ప్రాంతంలో విడిది చేస్తున్నారు. ఇక తాజాగా ప్రమాదం జరిగిన ఫాఫమౌ ప్రాంతానికి సంగమం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గతంలోనే గంగా నదిపై రెండు లైన్ల వంతెన ఉండగా.. మహాకుంభమేళాకు ముందు అధికారులు మరో వంతెనను జోడించారు. అంటే ఈ రెండు లైన్ల వంతెనకు ఆనుకుని పిపా వంతెనను నిర్మించారు. దీని ద్వారా భక్తులు వచ్చి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. తాజాగా అది కూలిపోవడం ఆందోళనకు దారి తీసింది.