పల్లకీలో మోహిని అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. దీనిలో భాగంగా శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌లకు అమ్మ‌వారు పల్లకీలో మోహిని అలంకారంలో భక్తులకు ద‌ర్శ‌నమిచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 26 వరకు వైభవంగా జ‌రుగుతున్నాయి.

సకల లోక రక్షణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యమోహినీ రూపంలో భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక అమ్మవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 22వ తేదీన ఉదయం స‌ర్వ‌భూపాల‌ వాహనంపై, రాత్రి గ‌రుడ‌ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

Share this post with your friends