శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 971వ అవతారోత్సవాన్ని ఫిబ్రవరి 23వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ కథనాలు ఉన్నాయి.