తిరుమల కొండ కింద పెను విషాదం.. ఆరుగురు దుర్మరణం

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆరుగురు మృతి చెండగా.. మరో 48 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మరణించిన వారిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు (51), విశాఖపట్టణానికి చెందిన రజిని (47), లావణ్య (40), శాంతి (34), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50)గా గుర్తించారు. ఈ ఘటన జరగడానికి ముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్ర వద్ద తమిళనాడులోని సేలం ప్రాంతానికి మల్లిగ (49) అనే మహిళ అస్వస్థతకు గురై మరణించింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు తిరుపతిలో 8 కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేపటి నుంచి మూడు రోజులు అంటే 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తంగా 1.20 లక్షల టికెట్లను టీటీడీ జారీ చేసింది. ఇవాళ ఉదయం నుంచే టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుపతికి నిన్న సాయంత్రమే చేరుకుని క్యూలైన్లలో వేచి ఉన్నారు. మొత్తంగా నాలుగు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.

Share this post with your friends