
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేది వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే సకల ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే విజిలెన్స్ పోలీస్ అధికారులతో టీటీడీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భక్తుల భద్రత, రవాణా, పార్కింగ్, క్రౌడ్ మేనేజ్మెంట్ అంశాలపై విస్తృతంగా చర్చించింది. బ్రహ్మోత్సవాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి ప్రణాళికలు సిద్దం చేశారు. భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రోజుకు 435 బస్సులు నడుస్తున్నాయి. దీని ద్వారా రోజుకు సుమారు 1.60 లక్షల మంది భక్తులకు పికప్, డ్రాప్ సౌకర్యం కల్పించనున్నారు. తిరుపతిలోని 23 పార్కింగ్ ప్రదేశాలను వాహనాల పార్కింగ్ కోసం సిద్ధం చేస్తున్నారు.
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో 1.85 లక్షల నుండి 2 లక్షల వరకు భక్తులు కూర్చునే సదుపాయం ఉంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలను తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 4200 మంది పోలీసులు, 1500 మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా క్రౌడ్ మూవ్మెంట్, రద్దీ పాయింట్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యమంత్రి, రాజ్యాంగపరమైన అధినేతలు, వీఐపీల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేసేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత వరకూ సురక్షితమైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అదనపు ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు.
