250 ఏళ్ల నాటి ఆలయం.. గుప్త నిధుల కోసం ధ్వంసం చేశారు..

ఒకప్పుడు ముస్లిం రాజులు ఆలయాలపై దాడులు చేసి పెద్ద ఎత్తున సంపదను దోచుకెళ్లేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు కానీ గుప్త నిధి గ్యాంగ్ ఒకటి తయారైంది. ఈ గ్యాంగ్ ఆలయ గోపురాన్నే ఏకంగా టార్గెట్ చేసింది. ప్రాచీన కట్టడాలను లక్ష్యంగా చేసుకుని బంగారం కోసం తవ్వకాలను సాగిస్తోంది. తాజాగా 250 సంవత్సరాల క్రితం నాటి పురాతన ఆలయ గోపురాన్ని గుప్త నిధులు ముఠా తవ్వింది. ఆ ఆలయం మరెక్కడో కాదు.. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం అనే గ్రామంలో ఉంది. గుప్త నిధుల కోసం గుడి గోపురాన్ని గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి గునపాలు, డ్రిల్లర్లతో కన్నం వేసి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు.

గుడి గోపురానికి కన్నం వేసి లోపలికి పొడవైన నిచ్చెనలు వేసుకొని మరీ లోపలికి ప్రవేశించారు. ఆలయ గోపురం సహా విగ్రహాలు, గోడలన్నింటినీ ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసమే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ గోపురం అత్యంత రమణీయంగా.. పలువురు దేవతల విగ్రహాలతో కూడి ఉంటుంది. అలాంటి ఆలయ గోపురాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మరింత లోతుగా తవ్వకాలు ప్లాన్ చేసినట్టుగా ఆనవాళ్లుండటంతో గుప్త నిధుల కోసమే తవ్వకాలు సాగించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Share this post with your friends